Monday, August 18, 2014

దేశ భాష లందు తెలుగు లెస్స!!

ఒక రోజున ఓ టి.వీ ఛానెల్ లో ఇంగ్లీషు మాట లేకుండా తెలుగు ఎంత సేపు మాట్లాడ గలరు అనే విషయాలపై పోటీ జరుగుతోంది. అందులో ఏ ఒక్కరు కూడ పది సెకండ్లకు మించి మాట్లాడలేకపోతున్నారు. ఆ కార్యక్రమం చూసిన తర్వాత నేను ప్రయత్నించి చూసాను. నా పరిస్ధితీ అంతే, అసలు తెలుగు భాషకు ఈ పరిస్ధితి ఎందుకు వచ్చిందా అని ఆలోచించడం మొదలుపెట్టాను.
అసలు భాష అంటే ఏమిటి ? మానవుని అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఒక సాధనం. సకల జీవరాసుల్లో మానవుడు ఒక్కడే తన భావాన్ని వాక్కు రూపంలో వ్యక్తపరచగలడు. మనిషికి ఉన్న ఒక అద్భుత శక్తి మాట్లాడడం. విశ్వసృష్టిలో మనిషికి ఉన్న శక్తి వాక్కు. అది మనిషకి తప్ప ఏ ప్రాణికి లేదు.
భారతదేశంలో మాట్లాడే వివిధ భాషలలో అది పురాతనమైన భాష తెలుగు భాష.  తెలుగు భాషకు ఉన్న విశిష్టతను బట్టి, శృతి మాధుర్యమును బట్టి పాశ్చాత్యులు ఇటాలియన్ ఆఫ ది ఈష్ట్అని తెలుగును కీర్తించారు. పాశ్చాత్యులు తెలుగు జాతిని, తెలుగు భాష గొప్పతనమును గురించి ఎంతో పొగడివున్నారు. మరుగున పడిన అనేక కావ్యాలను వెలుగులోనికి తెచ్చినవది కూడ పాశ్చాత్యులే. గూగుల్ వారు, ఫైర్ ఫాక్స్ వారుకూడ తెలుగు భాషను కంప్యూటర్ లో ప్రవేశపెట్టారు. కంప్యూటర్ లోకూడ ఇన్ స్కృప్ట్ లే అవుట్ ద్వారా తెలుగును మనం టైపింగ్ చేసుకోవచ్చును. దీని ద్వారా తెలుగుకు అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్ఠలు ఉన్నాయని చెప్పవచ్చును.
తెలుగు భాషకు అంతర్జాతీయంగా ఇంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ, మన రాష్ట్రంలో మాత్రం నిర్లక్షానికి గురి అవుతున్నది. తెలుగుదేశంలో పుట్టి, తెలుగు మాతృభాష అయివుండి తెలుగు అంటే ఇష్టం లేకుండా, తెలుగు భాషను విస్మరిస్తున్నారు. ప్రస్తుతం యువతరంలో చాలా మందికి తెలుగులో రాయటం రాదు, కొంత మందికి చదవటం రాదు, ఇంకొంత మందికి ఇంగ్లీషు పదాలు లేకుండా మాట్లాడము రాదు. ఎందుకంటే ప్రతి విద్యాసంస్ధలోను ఆంగ్లమును మాద్యమంగా ప్రవేశపెట్టారు. ప్రతివారు ఆంగ్లము మీద మొగ్గు చూపటంతో పరిస్ధతి ఇంత దారుణముగా తయారు అయ్యింది. పట్టణాలలో ఉండే చాలామంది తెలుగువారు ఆంగ్లమునే ప్రధాన భాషగా ఎన్నుకున్నారు. ప్రతివారిపైన ఆంగ్లభాష ప్రభావం ఎక్కువగా వుంటోంది.
ప్రపంచాన్ని ఏలే భాషలలో ఆంగ్లభాష మొదటిది అని చెప్పవచ్చును. ప్రపంచంలో ఇంకా ఎక్కువమంది ఈ భాషను నేర్చుకోబోతున్నారని చెప్పవచ్చును.విద్యారంగాలలో, వ్యాపారరంగాలలో, రాజకీయ రంగాలలో ఆంగ్లభాష అగ్రస్ధానం సంపాదించుకుంది. సుమారు 200 కోట్లమంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లభాషను వాడుతున్నారు.90 శాతం అంతర్జాతీయ వ్యవహారములు ఆంగ్లములోనే నడుస్తున్నాయి. అందుకే ఆంగ్లభాషను గ్లోబల్ లాగ్వేజ్ గా గుర్తించారు.
ఇంత ప్రాముఖ్యంవున్న ఆంగ్ల భాషను నేర్చుకోవడంలో తప్పులేదు. మనిషి మనుగడకు ఆంగ్లమును ఉపయోగించినా, మన కన్నతల్లి లాంటి తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని విస్మరించకూడదు. ప్రతి మనిషికి కనీసం రెండు భాషలలో ప్రవేశం వుంటుందంటారు. మాతృభాషలో పటుత్వం ఉన్నవారు ఏ భాషనైనా అవలీలగా పట్టుకుంటారనేది నానుడి.
అయినా, కంప్యూటర్లకు కూడ భాషలు వచ్చిన ఈ రోజులలో తెలుగు భాష గురించి ఆలోచించడం అనవసరం అంటున్నారు ఇప్పటి యువతరం. వాళ్లు మాత్రం ఎన్ని భాషలని నేర్చుంకుంటారని చెప్పండి? వారికి ఉపయోగపడే భాషలకు వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో ఎవరిని తప్పుపట్టలేము. తెలుగు మీద మక్కువ వున్నవారు ఇప్పటికీ రీసెర్చి చేస్తున్నారు. తెలుగు బ్లాగులు, వెబ్ సైట్ లు తయారుచేస్తున్నారు. వేదాలను కూడ కంప్యూటర్ లో ప్రవేశపెట్టిన వారు తెలుగు వారే అని నేను గర్వంగా చెబుతున్నాను.
ఇంత ప్రాముఖ్యం వున్న తెలుగు నిర్లక్షానికి ఎందుకు గురిఅవుతుంది?  తెలుగుదనం కన్నా తియ్యదనం మరెందులోను లేదు. తెలుగు కవులు కన్నా ఘనులు లేరు అని మన యువతరం తెలసుకోవాలి. తెలుగు జాతికి మహోజ్వలమైన చరిత్ర వుంది. భావితరాల వారికి మనం ఇవ్వవలసినది భౌగోళిక సంపదలే కాదు. అద్భుతమైన తెలుగు సాహిత్యాన్ని మన వారసులకు అందించాలి. తెలుగు సంస్కృతి, సంస్కారం, అపురూపమైన కళా సంపద రేపటి తరాలకు అందేలా మన ప్రయత్నం మనం చేద్దాం. అప్పుడే తెలుగు భాష అంతరించకుండా కాపాడుకోగలుగుతాము. 

అప్పుడే., తెలుగు భాషలందు తెలుగు లెస్స!! అనే నానుడి సార్ధకం చేసినవారము అవుతాము.

Thursday, March 22, 2012

యుగాది


యుగాది



బ్రహ్మ" గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర ఆరంభం దినంగా పరిగణిస్తాం.
అందుచేత ఈ ఉగాది పర్వ శుభదినాన అందరూ ప్రాతఃకాలమున నిద్రలేచి అభ్యంగనస్నానమాచరించి నూతన వస్త్రములు ధరించి మంగళ ప్రదమైన మావిడాకులు రంగవల్లికలు ముంగిట అలంకరించుకుని వసంతలక్ష్మిని స్వాగతిస్తూ.. షడ్రచులతో సమ్మిళతమైన ఉగాది ప్రసాదాన్ని, పంచాగానికి, సంవత్సర దేవతకు నివేదనచే తమ తమ భావజీవితాలు మృదుమధురంగా సాగించాలని ఆకాంక్షిస్తూ, ఉగాది పచ్చడి స్వీకరిస్తూ ఉంటారు.

ఈ ఉగాది పచ్చడిని వైద్యపరంగా పరిశీలిస్తే ఇది వ్యాధినిరోధక శక్తిని ఇస్తుందని కూడా చెప్తారు. ఆ పచ్చడిలోని షడ్రరుచులలోని తీపి-చేదులో మానవ మనుగడలకు ప్రతీకలై నిలుస్తూ ఉంటాయని అంటుంటారు.

ఇక తెలుగువారి సంప్రదాయాల్లో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ణాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్టులను ఆహ్నానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశమందు పంచాంగ శ్రవణము చేస్తారు. ఆ రోజు అందరూ ఆ నూతన సంవత్సరంలోని శుభశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావిజీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు.

ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల, తిథితో సంపదను, వారంతో ఆయుష్షు, నక్షత్రంతో పాపప్రక్షాళ, యోగం వలన వ్యాధి నివృత్తి కావడం, కరణంవల్ల గంగాస్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం. మరి ఈ ఉగాది సర్వులకు ఆయురారోగ్యాలు, సంపదలు, సుఖమయ జీవనాన్ని అందించాలని ఆశిస్తూ.. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు..!